మునుపటి నా మాట
జూన్ 17...జూన్ 15....జూన్ 13 అలా చదువుతూ పోతుంటే కేలండర్ రెండేసి రోజుల తేడాతో వెనక్కి పోతున్నట్టు అనిపించడం సహజం. కాల గమనంలో ఒక్కసారి జ్ఞాపకాల దారుల్లో ఆగి వెనక్కి చూస్తే ఆ మూడు రోజులు మన మధ్య లేని మహా పురుషులు ముగ్గురుని గుర్తు చేస్తాయన్నది నిజం. జూన్ పదిహేడున ‘అచ్చ తెనుగుభాష’ పుట్టింది, ఎప్పుడూ, 1905లో. జూన్ 15 న ‘విప్లవ భాష’ కనుమరుగైంది, ఎప్పుడూ, 1983లో. జూన్ 13న ‘గజల్ షాయరీ భాష’ మరో రూపంలో మూగ బోయింది, ఎప్పుడూ ... మొన్న మొన్ననే. అచ్చ తెనుగు భాష కి తెలుగువాళ్ళు పెట్టిన ముద్దు పేరు – మల్లాది రామకృష్ణ శాస్త్రి . విప్లవ భాష తెలుగు వాళ్ళకి నేర్పిన పెద్ద పేరు – శ్రీరంగం శ్రీనివాసరావు. ఇక్కడ దేశం లోని రాజస్తాన్ లోని ‘లూనా’ లో పుట్టి, పొరుగు దేశానికి వలస పోయి కుస్తీ పట్టు తో పాటు పట్టుదలతో గళం సవరించి ‘గజల్ షాయరీ’ భాషకొక రంగు, రుచి, వాసన ఉంటుందని తెలియజేసిన గాయక శిఖామణి పేరు- మెహదీ హస్సన్. మల్లాది వారి తెలుగు కరువై దాదాపు యాభై ఏళ్ళవుతోంది. మహాకవి కదిలించిన సాహితీ విప్లవ రధం ఆగిపోయి ఇంచుమించు మూడు దశాబ్దాలౌతోంది.
0 Comments
పుణేలో ‘శ్రీశ్రీ poly clinic’ అని ఒక చోట చదివి (అయిదారేళ్ళ క్రితం), ‘ఆహా శ్రీ శ్రీ అభిమానులెవరో గానీ ఆయన పేరు పెట్టుకున్నారే!’ అని ఆశ్చర్యపోతూ ఆనందించాను. ఆలస్యంగా వెలిగింది- శ్రీశ్రీ అంటే గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ అనీ! రవిశంకర్ తెలుసా అంటే తెలియకేం, సితార పండిట్! అనే రోజులూ కావిప్పుడు. కాలం మారుతూ ఉంటుంది. కాలంతో పాటూ జ్ఞాన తృష్ణ కూడా మారుతూ ఉంటుంది. కాలంతో పాటు మనిషి జీవన విధానం అస్తవ్యస్తం అవుతూ ఉంటే దాని మూలాలు వెతికి పట్టుకునే వాళ్ళూ, పరిష్కారం ఇదైతే బావుంటుందేమో అని కొన్ని ‘ఇజాలు’ భుజాల మోసుకొచ్చి అవి భారంగా అనిపించుకోక బాధ్యతగా తీసుకునే వాళ్ళూ ప్రపంచంలో అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన వ్యక్తీ, కవీ మన శ్రీరంగం శ్రీనివాసరావు మాస్టారు. పసివాడినుంచీ పండు ముసలి వరకు నాల్క మీద సునాయాసంగా పలికే ‘శ్రీశ్రీ’ అన్న మాట, మాస్టారు పేరుకి సంక్షిప్త రూపమన్న మాట. శ్రీశ్రీ – ఒక చిత్రమైన ఏకాక్షర కలయిక. అలాగని శ్రీశ్రీ ఏకాకి కాలేదు ఎప్పుడూ. చేతుల్లో కలం, మెదడులో బుద్ధి బలం, పిలుపులో ప్రజా శక్తి ఆయన వెంట ఉన్నవే. శ్రీరంగం శ్రీనివాసరావు అన్నది నూటొక్క ఏళ్ళ క్రితం కుదిరిన పేరు. కుదించిన శ్రీశ్రీ అనే పేరు మరో శతాబ్దాన్నీ నడిపించే సౌరతేరు. బాగా దూరం నుంచి చూస్తే ‘శ్రీరంగంశ్రీనివాసరావు’ కచ్చితంగా ‘శ్రీశ్రీ’ గా కనిపిస్తారు. చాలా దగ్గరనుంచీ చూస్తే మటుకు ఆ రంగం, ఆ నివాసం కూడా కనిపిస్తాయి. ఆ రంగం సినీ రంగం. ఆ నివాసం ప్రజల గుండె. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|